పంచతంత్రం

 


రాజధర్మం


మామిడిపళ్ళు కావాలని మారాం చేసిన ధనగుప్తుని కొడుకుని వెంటబెట్టుకుని బయటికి వచ్చాడు ఇంద్రపాలితుడు. పిల్లాడికి పళ్ళు కొనిపెట్టలేదు సరికదా, పిల్లాణ్ణి దాచేసి, తిరిగొచ్చాడు. పిల్లాడేడి? అని అడిగిన ధనగుప్తునితో ఇలా చెప్పాడు ఇంద్రపాలితుడు.‘‘గెద్ద ఎత్తుకుపోయింది.’’ఆ మాటకి ఆశ్చర్యపోయాడు ధనగుప్తుడు. పిల్లాణ్ణి గెద్ద ఎత్తుకుపోవడమేమిటి? అని ఆలోచించాడు. అసంభవం అనిపించింది. అసాధ్యమనిపించింది. కోపం వచ్చిందతనికి. వెళ్ళి ఇంద్రపాలితుని పీక పట్టుకున్నాడు.‘‘నిజం చెప్పు? నా పిల్లాణ్ణి ఏం చేశావు?’’ అడిగాడు.‘‘నిజమే చెబుతున్నాను. నీ కొడుకుని గెద్ద ఎత్తుకుపోయింది.’’ గొంతు పెగల్చుకున్నాడు ఇంద్రపాలితుడు.‘‘లేదు, గెద్ద ఎత్తుకుపోలేదు. నువ్వే వాణ్ణేదో చేశావు. పిల్లాడి వంటి మీదున్న బంగారం కోసం వాణ్ణి పొట్టన పెట్టుకుని ఉంటావు. చంపేసి ఉంటావు. అవునా?’’‘‘లేదు, గెద్ద ఎత్తుకుపోయింది వాణ్ణి.’’‘‘నోర్ముయ్‌! అబద్ధాలాడకు. నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. పద’’ అంటూ ఇంద్రపాలితుణ్ణి నెట్టుకుంటూ న్యాయాధికారి దగ్గరకి వచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు.


‘‘పళ్ళు కొనిపెడతానని పిల్లాణ్ణి తీసుకుని వెళ్ళి, ఏం చేశాడో చేశాడు. పైగా గెద్ద ఎత్తుకుపోయిందని అబ ద్ధాలు ఆడుతున్నాడు.’’ భోరుమన్నాడు ధనగుప్తుడు.‘‘నిజం చెప్పు! పిల్లాణ్ణి ఏం చేశావు?’’ ఇంద్రపాలితుణ్ణి అడిగాడు న్యాయాధికారి.‘‘నేనేం చెయ్యలేదు మహాప్రభో! నిజమే చెబుతున్నాను. పిల్లాణ్ణి గెద్ద ఎత్తుకుపోయింది.’’‘‘పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. నిజం చెప్పు’’ గద్దించాడు న్యాయాధికారి. అప్పుడు చెప్పాడిలా ఇంద్రపాలితుడు.‘‘అయ్యా! నేను ఈ ధనగుప్తునికి అరవై బారువుల ఇనుము అప్పగించి, బేరం వస్తే అమ్మిపెట్టమని చెప్పి, పని మీద పై వూరి వెళ్ళి తిరిగొచ్చాను. ఇనుము అమ్మి ఉంటాడనుకున్నాను. అయితే ఇనుము అమ్మలేదంటూ, అమ్మడానికి గిడ్డంగిలో ఇనుము ఉంటే కదా అన్నాడు. ఏమయిందని అడిగితే ఎలుకలు తినేశాయన్నాడు. ఇనుమును ఎలుకలు తినగా లేనిది, పిల్లాణ్ణి గెద్ద ఎందుకు ఎత్తుకుపోదో మీరే సెలవీయండి.’’అసలు సంగతి అప్పుడు అర్థమయింది న్యాయాధికారికి. నవ్వుకున్నాడతను. ఇంద్రపాలితుడి అరవై బారువుల ఇనుమూ ఎక్కడ దాచిందీ తెచ్చి ఈయమన్నాడు న్యాయాధికారి. ధనగుప్తుడికి ఇవ్వక తప్పలేదు. తెచ్చిచ్చాడు. దాంతో దాచిన పిల్లాణ్ణి తీసుకుని వచ్చి న్యాయాధికారి ముందుంచాడు ఇంద్రపాలితుడు.


‘‘బాబూ’’ పరుగున వెళ్ళి పిల్లాణ్ణి కౌగలించుకున్నాడు ధనగుప్తుడు. తర్వాత తప్పుని ఒప్పుకుని శిక్షను అనుభవించాడు.’’ కథ ముగించాడు కరటకుడు. దమనకుడికి కథలో నీతి అర్థమయింది. తనని కరటకుడు కథల రూపంలో తిట్టి పోస్తున్నాడు. భరించాల్సిందేననుకున్నాడు.కొండ విరిగి పడ్డట్టుగా సంజీవకుడు కింద పడిపోయాడు. నెత్తురు కక్కుకుంటూ చనిపోయాడు. పింగళకుడి కసి తీరింది. యుద్ధంలో అలసిపోయాడేమో! ఆయాసపడుతూ కూర్చున్నాడు పింగళకుడు. కాస్సేపటికి తేరుకున్నాడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూశాడు. తప్పు చేశాననిపించింది. కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించసాగాడిలా.జరిగిందేమిటి? తప్పెవరిది? ఉత్తపుణ్యానికి సంజీవకుణ్ణి ఎందుకు చంపాను? రాజన్న వాడు సేవకుల్ని కాపాడాలిగాని, కడతేర్చకూడదు. కాని కడతేర్చాను. ఎంత తప్పు చేశాను. భరించేవాడు భర్త అన్నట్టుగా ప్రజల్ని రక్షించి, పోషించేవాడే రాజు. అంతేకాని, ప్రజల్ని భక్షించేవాడు రాజెందుకవుతాడు. కాడుగాక కాడు. నేను రాజుగా పనికిరాననుకున్నాడు పింగళకుడు.తెలిసో తెలియకో సేవకుడు తప్పు చేశాడు. మొదటిసారి చేశాడు. భయపెట్టాలి. మళ్ళీ తప్పు చేస్తే ఒప్పుకోననాలి. హెచ్చరించాలి. మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలి. అయినా మళ్ళీ తప్పు చేశాడు. రెండోసారి చేశాడు. ఇక ఉపేక్షించకూడదు. కొలువులోంచి తీసేయాలి. పదవి పోయిందంటే బతకడం కష్టం. ఆ కష్టమే చేసిన తప్పుకి శిక్షనిపించాలి. అంతేగాని చంపడం ఏమిటి? చేసిన తప్పులకు ఇలా చంపుకుంటూ పోతే ప్రజలేమవుతారు? మిగులుతారా? ప్రజల సంగతి పక్క నుంచు! రాజేం కావాలి. ప్రజల్ని కడతేర్చుకుంటూ పోతే రాజుని ప్రజలు క్షమిస్తారా? క్షమించరుగాక క్షమించరు. తిరగబడి చంపుతారు. చంపడం, చావడం సమస్యలకు పరిష్కారం కాదనకున్నాడు పింగళకుడు.ఇసుక నుండి నూనె తీయొచ్చు. కుందేటికి కొమ్ము మొలిపించవచ్చు. కాని, మంచి సేవకుణ్ణి సాధించడం కష్టం. అందులోనూ ప్రభుభక్తి కలిగిన సేవకుణ్ణి సంపాదించడం ఇంకా కష్టం. సేవకుడు తానొట్టి సేవకుడు అనుకుంటే ఏముంది? వేతనానికి తగిన పని చేసి, వెళ్ళిపోతాడు. తాను ప్రభువుకి కావాల్సినవాణ్ణి, ప్రజలకూ ప్రభువుకూ వారథిలాంటి వాణ్ణి అనుకుంటేనే రాజభక్తులు, దేశభక్తులుగా తయారవుతారు. సంజీవకుడు ఉట్టి సేవకుడు కాడు. గొప్పసేవకుడు. అలాంటివాణ్ణి పోగొట్టుకున్నాను. చేజేతులా చంపుకున్నాననుకున్నాడు పింగళకుడు. కళ్ళిప్పి చూశాడు.


 ఎదురుగా చచ్చిపడి ఉన్న సంజీవకుడు కనిపించాడు. తట్టుకోలేకపోయాడు పింగళకుడు. సంజీవకుడి చుట్టూ తిరుగుతూ రోదించసాగాడు.‘‘మిత్రమా! మిత్రమా’’ అంటూ గోల గోల చేశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమో! కొడితే లేస్తాడేమో అనుకుని కాలితో సంజీవకుణ్ణి తడుతూ ఆశగా చూశాడు. ఎక్కడా కదిలిక లేదు. నెత్తి కొట్టుకున్నాడు పింగళకుడు. పిచ్చెక్కినట్టుగా పొర్లి పొర్లి ఏడవసాగాడు.రాజు ప్రవర్తన అంతు చిక్కకుండా పోయింది, కరట దమనకులకి. కరటకుడయితే ఒకటి ఊహించాడు, ఈ పరిస్థితుల్లో తానిక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదనకున్నాడు. దమనకుడికి కూడా చెప్పకుండా పక్కకి తప్పుకున్నాడు. కరటకుడు అలా అక్కణ్ణుంచి తప్పుకోవడాన్ని చూసి, ‘బతికిపోయాడు’ అనుకున్నాడు దమనకుడు. రాజుని సమీపించాడు.

‘‘వూరుకోండి రాజా, వూరుకోండి.’’ అని ఓదార్చాడు.‘‘చూడేం చేశానో! ఎంత పాపానికి ఒడిగట్టానో’’ అన్నాడు పింగళకుడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూపించాడు.‘‘పాపం అని ఎందుకనుకుంటున్నారు? మీరేం పాపం చేయలేదు. పుణ్యమే చేశారు. శత్రువుని చంపడం పాపం కాదు! పుణ్యమే’’ అన్నాడు దమనకుడు.‘‘రండి మహారాజా’’ అని పింగళకుణ్ణి మంచినీటి మడుగు దగ్గరగా తీసుకుని వెళ్ళాడు.‘‘దాహం తీర్చుకోండి’’ చెప్పాడు. కడుపు నిండుగా నీరు తాగాడు పింగళకుడు. ప్రశాంతత కలిగిందతనికి.


‘‘శత్రువుని చంపి దుఃఖించడం రాజ లక్షణం కాదు. రాజన్న వాడు శత్రువుని చంపి తీరాలి. అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం మునుల లక్షణం. అది రాజ లక్షణం కాదు.’’ చెప్పాడు దమనకుడు.‘‘జరిగిందేదో జరిగిపోయింది. తప్పో ఒప్పో చేసేశారు. అయితే తాను చేసింది తప్పని రాజు తెలుసుకుంటే చాలు, చాటింపు వేయకూడదు. చాటింపు వేసినట్టుగా ప్రవర్తించకూడదు. అది రాజ్యానికే ప్రమాదం. రాజు మెత్తని వాడని శత్రువే కాదు, ప్రజలూ గ్రహించ కూడదు.’’ అన్నాడు దమనకుడు.‘అవునా’ అన్నట్టుగా చూశాడు పింగళకుడు.‘‘రాచరికం వీధుల్లో పడి రోదించకూడదు. పదండి గుహకి.’’ అన్నాడు. బయల్దేరాడు పింగళకుడు. అతన్ని అనుసరించాడు దమనకుడు.


కుందేలు- కోతులు


అనగనగా కర్పూరద్వీపం. ఆ ద్వీపంలో ఓ సరస్సు ఉంది. దాని పేరు పద్మకేళి. ఆ పద్మకేళిలో హిరణ్యగర్భుడు అనే హంస ఉంది. ఆ హంసే అక్కడి పక్షులన్నిటికీ రాజు. హిరణ్యగర్భుడు బుద్ధిమంతుడనీ, సజ్జనుడనీ చెప్పకుంటారంతా. ఒకరోజు హిరణ్యగర్భుడు దగ్గరకి ఓ కొంగ వచ్చింది. దాని పేరు దీర్ఘముఖుడు. ఈ కొంగ చాలా నెలలుగా అక్కడ లేదు. ఎటో వెళ్ళిపోయింది. మళ్ళీ రావడం ఇదే! దీర్ఘముఖుణ్ణి చూస్తూనే ఆనందంగాపలకరించాడు హిరణ్యగర్భుడు.‘‘క్షేమమేనా దీర్ఘముఖా’’ అడిగాడు.‘‘మీ ప్రజలుగా మేము ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాం మహారాజా.’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘నిన్ను చూసి చాలా రోజులయిందయ్యా! ఎక్కడికెళ్ళావు ఇన్నాళ్ళూ. విశేషాలేమిటి?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘విశేషం ఒకటే! నన్ను చూశారుగా, ఎలా చిక్కిపోయానో, అదే విశేషం. ఉన్న వూరినీ కన్నత ల్లినీ వదులుకుంటే సుఖం ఉండదు మహారాజా’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘అయితే విశేషాలేమీ లేవంటావు?’’‘‘లేకపోవడమేమి? ఉన్నాయి. కాని అవన్నీ చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. సేదదీరి, బలం తెచ్చుకుని చెబుతానన్నీ. కాకపోతే చిన్న పొరపాటు చేశాను. ఏం జరిగిందంటే...’’ చెప్పసాగాడు దీర్ఘముఖుడు.‘‘జంబూద్వీపంలో వింధ్యపర్వతం ఉంది కదా, ఆ పర్వతం మీద ఓ నెమలి ఉంది. దాని పేరు చిత్రవర్ణుడు. ఆ చిత్రవర్ణుడే అక్కడి పక్షులకు రాజు. పెద్దపెద్ద చెట్లూ, సెలయేళ్ళూ ఓయమ్మో, పర్వతం మీద పెద్ద అడవే ఉంది. ఆ అడవిలో నన్ను చూశాయి పక్షులు.


కొత్తగా కనిపించానేమో! ‘ఎవరు నువ్వు? ఏ దేశం నీది? ఇక్కడికి ఎందుకొచ్చావు? మీ రాజు ఎవరు?’ అంటూ ఒకటే గోల చేశాయి. చెప్పాలి కదా, మీ గురించి గట్టిగానే చెప్పాను. నా గురించి కూడా తప్పనిసరై చెప్పుకున్నాను.నా పేర దీర్ఘముఖడు అన్నాను. పద్మకేళి నుండి వచ్చానన్నాను. మా రాజు హిరణ్యగర్భుడు అని చెప్పి, మా రాజు గొప్ప పుణ్యాత్ముడన్నాను. దేశదేశాలు చూడాలని బయల్దేరాను. చూస్తూ ఇక్కడ వాలాను. మీరూ, మీ దేశం బాగుంది. ఈ రోజు మీతో గడిపి, రేపు వెళ్ళిపోతాను. మీకు అభ్యంతరం అయితే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాను.‘అతిథుల రాకపోకల మీద అభ్యంతరాలు ఎందుకుంటాయి. బలేవారే, ఉండండి.’ అన్నాయి పక్షులు. బాగా ఆదరించాయి. ప్రేమగా అడవిలోని వింతలూ-విశేషాలూ చూపించాయి. అప్పుడే చిత్రవర్ణుణ్ణి కలిశాను. అయిందా, ఆ తర్వాత అక్కడి పక్షులు నన్నిలా అడిగాయి.‘మీకు మీ రాజ్యం బాగుందా? మా రాజ్యం బాగుందా?’‘మీ రాజు గొప్పవాడా? మా రాజు గొప్పవాడా?’‘కాకామాటలు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నిజం చెప్పండి’అప్పుడిక చెప్పక తప్పలేదు. చెప్పానిలా.


‘మీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. అందుకే ఇలా ప్రశ్నిస్తున్నారు. బావిలో కప్పలు కూడా మీలాగే ఉంటాయి. మా రాజ్యానికీ మీ రాజ్యానికీ పోలికా? కుదరదు. మా రాజ్యం ఏనుగయితే, మీ రాజ్యం దోమ. ఏనుగుకీ, దోమకీ పోలిక కుదురుతుందా? మీరే చెప్పండి. మా దేశం అద్భుతం. అందంగా ఉంటుంది. మీది? కీకారణ్యం. చూడ్డానికే చిరాకు పుడుతోంది. మా రాజు ఇంద్రుడు. ఇంద్రవైభవం మా రాజుది. ఏది తిన్నా రాజాలా తింటాడు. మీది అడవి కదా, మీరూ మీ రాజూ కాయలూ దుంపలూ తింటూ బతకాలి. మీరసలు చెప్పుకోదగిన పక్షులే కాదు, కాకిమూకలు మీరు. మీకో రాజు. నెమలిరాజుని పట్టుకుని మీరు వేలాడ్డం. ఛఛ! బాగాలేదు. అయినా తప్పు మీది కాదు, మిమ్మల్నలాపుట్టించాడు భగవంతుడు అన్నాను.’’‘‘అంతంత మాటలంటుంటే వింటూ ఊరుకున్నాయవీ?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘ఊరుకున్నాయి కాబట్టే రెచ్చిపోయాను. తర్వాత ఇంకా వినండి, ఏవన్నానో.’’‘‘ఏవన్నావు?’’‘‘ఎంతయినా సాటి జీవాలు కాబట్టి, సాటి పక్షులు కాబట్టి మీ క్షేమం కోరి మీకో మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిజంగా మీరు బాగుపడదలచుకుంటే, ఇంతకంటే అద్భుతంగా బతకదలచుకుంటే స్వర్గంలాంటి మా దేశానికి పారిపోదాం, రండి. రేప్పొద్దున నేను బయల్దేరుతాను కదా, అప్పుడు నాతో పాటు వచ్చేయండి. ఇంకో ఆలోచన పెట్టుకోకండి. పదండి, పోదాం అన్నాను’’‘‘వస్తామన్నాయా?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.


‘‘అలా అంటే కథే లేదు. వస్తామనలేదు. పైగా మిమ్మల్నీ, మన రాజ్యాన్నీ పొగిడి, వాళ్ళ రాజునీ, రాజ్యాన్నీ తెగిడినందుకు కోపం తెచ్చుకున్నాయి. తెచ్చుకుని, నన్నూ, మిమ్మల్నీ అనరాని మాటలన్నాయి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. అవి చెప్పడానికి నోరు రావడం లేదు.’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘అనవసరంగా నన్నెందుకు ఇరికించావయ్యా ఇందులో’’ బాధపడ్డాడు హిరణ్యగర్భుడు.‘‘ఇరికించడం ఏముంది మహారాజా! రాజభక్తి అది. నా చేత రాజభక్తే అలా మాట్లాడించింది. అయినా ఊరూ పేరూ లేనివాళ్ళు తిడితే మనకొచ్చే నష్టమేంటి? పిచ్చిప్రజ! వాళ్ళ బుద్ధే బయటపడింది. బుద్ధిలేని వారికి బుద్ధి చెప్పకూడదు. చెబితే మనకే ప్రమాదం. సలహా చెప్పినా, మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలివైనవారికే చెప్పాలి. మంచివారికే చెప్పాలి. అంతేకాని, తెలివితక్కువ వారికీ, బుద్ధిహీనులకీ చెప్పకూడదు. చెబితే కోతులకు నీతులు చెప్పడానికి ప్రయత్నించిన కుందేలులా ప్రమాదంలో పడతాం.’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘ఏంటా కుందేలు కథ?’’ అడిగాడు హిరణ్యగర్భుడు. చెప్పసాగాడిలా దీర్ఘముఖుడు.


‘‘అనగనగా ఓ పర్వతం. దాని పేరు మాల్యవంతం. దాని మీదో అడవి. ఆ అడవిలో లెక్కకు మిక్కిలిగా కోతులున్నాయి. ఆ కోతులకోసారి దాహం వేసింది. దాహంతో అల్లాడిపోయాయి. నీళ్ళ కోసం పరుగులు పెట్టాయి. ఎక్కడా చుక్క నీరు కనిపించలేదు. పైగా ఎండమావుల్ని నమ్ముకుని తిరిగి తిరిగి అలసిపోయాయి. ప్రాణాలు పోతున్నట్టనిపించి, మరి తిరగలేక అన్నీ ఓ మర్రిచెట్టు కింద కూలబడ్డాయి. వాటిలో పెద్దది కొండముచ్చు బాధపడుతూ ఇలా అంది.‘తప్పు చేశాం. పొర్లుతున్నట్టుగా నీరు కనిపిస్తూంటే పరిగెత్తుకుని వచ్చాం. తీరా చూస్తే నీరెక్కడా కనిపించలేదు. ఎక్కడి వాళ్ళం ఎక్కడికొచ్చాం! సుమారుగా ఏడెనిమిది మైళ్ళ దూరం పరిగెత్తుకొచ్చాం. ఎండకి కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. దాహానికి నాలుక పిడచకట్టుకుపోతూ ఉంది. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. ఏం చెయ్యాలో ఏమిటో అర్థం కాకుండా ఉంది.’ఆ మాటలు మర్రిచెట్టు తొర్రలో ఉన్న కుందేలు వింది. పాపం అని కోతులు మీద జాలి పడింది. తొర్రలోంచి బయటికొచ్చి ఇలా అంది.


‘పిచ్చికోతుల్లారా, పొర్లుతున్నట్టుగా నీరు కనిపించిందా, దానికి పరిగెత్తుకుని వచ్చారా? ఏమంటారో తెలుసా వాటిని? ఎండమావులంటారు. ఎండమావుల్లో నీరుండదు. ఉన్నట్టు కనిపిస్తుందంతే! పరుగెత్తి అలిసిపోవడం మీదే తప్పు.’అంత అలుపులోనూ కోతులికి కోపం వచ్చింది. కుందేలుని ఎర్రగా చూశాయి. పట్టించుకోలేదది కుందేలు. ఉపకారానికి పోయింది.


‘ఇప్పుడు మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే అదిగో, అక్కడ వాలులో ఓ చెరువు ఉంది. అక్కడిపోయి దాహం తీర్చుకోండి.’ అంది. మంచిమాట చెప్పాననుకుంది. గుంపుగా పరుగుదీస్తాయనుకుంది. అయితే ఏదీ కదల్లేదు. తనని కొరకొరా చూస్తూ కూర్చున్న కోతుల్ని వింతగా చూడసాగింది కుందేలు. అదలా చూస్తూండగానే వెనుక నుంచి వచ్చి కుందేలు కాళ్ళు ఎత్తి పట్టుకుందో కోతి.‘ఎంత ధైర్యమే నీకు, మమ్మల్ని పిచ్చికోతులంటావా? ఎండమావుల్లో నీరుంటుందా? అని ఎగతాళి చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో’ అంది.


వద్దు వద్దని బతిమలాడుకుంటున్నా కుందేల్ని నేలకేసి కొట్టి కొట్టి చంపింది.‘చచ్చింది వదిలేయ్‌’ అంది కొండముచ్చు. కోపం చల్లారిని కోతులు చెరువు వేపు పరుగుదీశాయి. అక్కడ నీరు తాగి దాహాన్ని తీర్చుకున్నాయి. ఎంచక్కా వచ్చిన వైపునకు నడకసాగించాయి.’’ కథ ముగించాడు దీర్ఘముఖుడు.‘‘మంచికథే’’ మెచ్చుకున్నాడు హిరణ్యగర్భుడు.‘‘ఇందులో నీతి గ్రహించారా మహారాజా, పొరపాటున కూడా మూర్ఖులకు హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు. అవునంటారా? కాదంటారా?’’‘‘కాదని ఎందుకంటాను. అవుననే అంటాను.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.

Comments

Popular posts from this blog

BarristerParvatheesam

Pottery Making

Moral story of the year