Telugu kavyam
తియ్యని కావ్యం.. కావాలి..!!
ఏదో కవిత వాసన కమ్మగా వస్తుంది
ఆ పుస్తకంలో పేజీలు దాటుకుంటూ
గాలికి రెపరెపలాడి కండ్లు కనిపిస్తూ
మనస్సు పుటలు ఆస్వాదన చేస్తుంది..
గూట్లో పుస్తకం గుప్పిట్లో చేరే
రంగుల ముఖచిత్రం మురిపించే
మునివేళ్ళు తాకుతూ ఉత్తేజం పొందే
కన్నులు పసందైన విందుకు ఎదురు చూసే...
నమిలే మనసుకు రుచికరం
కప్పి చెప్పే కవిత్వం నారికేళ పాకంలా
విమర్శకుల ప్రశంసలు పొందే
విశ్లేషకులకు భావం ఊట బావిలా ద్రవించే...
అక్షరాలతో అల్లిన పదబంధం
చదివి మనసుకు నవరస బంధం
అలతి పదాలు ప్రయోగం
సంధించిన అలంకారం మోహనాస్త్రం...
కళ్ళు అక్షరాలను తింటూ కదులుతున్నాయి
పదం వాక్యం నములు కుంటూ
పంటి కింద పడ్డ అక్షర ద్వయం
చెరుకు ముక్కలా తీయటి అనుభూతి పంచే...
పుస్తకములో కాగితాలు పరుగెత్తుతున్నాయి
మనసు వేగంగా కదులుతుంది
కళ్ళు దేనికో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి
రసజ్ఞత గల వాక్యం కోసము....
సృష్టించిన వాక్యాలు కుప్పలు తెప్పలు
అమృత వాక్యమే శాశ్వత కీర్తి
పొత్తములో ఒక వాక్యము నిలిచిన ధన్యం
రాసిన కవి జన్మకు అదే మహాభాగ్యం..
Comments
Post a Comment